కళల ఖజానా విజయవాడలో కన్యాశుల్కం
నాటకానికి మరోసారి ప్రేక్షకాభిషేకం జరిగింది. తెలుగు నాటకానికి ఎక్కడా ఆదరణ
తగ్గలేదని నిరూపితమైంది. ఎప్పుడో 1892లో మహాకవి గురజాడ అప్పారావు రచించిన
ఈ నాటకాన్ని ఈ నాటికీ తిలకిస్తూ తెలుగు కళాభిమానులు తమ ఔన్నత్యాన్ని
చాటుకున్నారు. వందేళ్ల తరువాత రాష్ట్రంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ
పరిస్థితులను ముందే ఊహించి, తన రచనలో పొందుపర్చి, కవికి ఉండాల్సిన ముఖ్య
లక్షణాన్ని ముందు తరాలకు అందించిన మహాకవి రచనకు విజయవాడ ప్రేక్షకులు
బ్రహ్మరథం పట్టారు.
ఆనాడు సమాజంలో పాతుకుపోయిన బాల్య వివాహాలు, మూఢ విశ్వాసాలు, వ్యక్తుల కుయుక్తులు, లంచావతారాలు... వంటి అంశాలపై వాడి వేడి వ్యంగ్యాన్ని రచించడంతో పాటు వితంతువులకు పునర్వివాహాలను సమర్ధిస్తూ సాగిన ఈ కన్యాశుల్కం నాటకంలోని ప్రతి పాత్రతో ఈ సమాజం కళ్లు తెరిపించే ప్రయత్నం చేశాడు మన గురజాడ. మహాకవి గురజాడ అప్పారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో నిరంతరాయంగా ఎనిమిది గంటల పాటు విజయనగరానికి చెందిన నవయుగ ఆర్ట్స్ కళాకారులు ప్రదర్శించిన ఈ నాటకం ఆద్యంతం ఆహూతులను అలరించింది.
ఈ నాటకంలో ప్రధానంగా మధువాణి పాత్ర కీలకమైంది. ఈ పాత్రలో కాకినాడకు చెందిన కళాకారిణి మణిబాల తన శక్తి వంచన లేకుండా నటించారు. మానవత్వానికి కుల, మతాలు ప్రా మాణికం కాదని, నిమ్న కులంలో పుట్టినా మానవత్వం ఉంటుందనే సందేశాన్ని ఈ పాత్ర ద్వారా గురజాడ వెల్లడించారు. మరో కీలక పాత్ర గిరీశంగా ఉదయభాస్కర్ పాత్రోచితంగా హావభావాలు ప్రదర్శించారు. రావప్ప పంతులుగా డాక్టర్ ఆర్.సత్యనారాయణ తన పాత్రకు న్యాయం చేశారు. అగ్నిహోత్రావధానులుగా నటించిన జి.వి.ఎన్.కృష్టమోహన్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. లబ్ధావధానులుగా జొన్నలగడ్డ సీతారామశాస్త్రి నటనకు ఆహూతుల నుంచి ప్రశంసలు లభించాయి. వెంకమ్మగా సురభి విద్యావతి, బుచ్చమ్మగా వెంక ట పద్మావతి, కరకటక శాస్త్రిగా తేలిచర్ల అనిల్, వెంకటేశంగా కృష్ణచైతన్యల నటనకు విచ్చేసిన వారంతా అభినందనలు తెలిపారు. మహేశంగా ఆదిత్య మాస్టార్, పూటకూళ్ళమ్మగా బత్తుల లక్ష్మి నటన అందరిచే శభాష్ అనిపించుకుంది. ఎప్పుడో 1892లో ఈ నాటకాన్ని గురజాడ అప్పారావు రచించగా అదే ఏడాది ఆగస్టు 13న విజయనగరంలో పూర్తి నిడివిలో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. 1897లో ఈ నాటకానికి అక్షర రూపాన్నిచ్చారు. 1909లో గురజాడే రెండోసారి ఈ నాటకంలో కొన్ని మార్పులు చేశారు. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది ఈ నవీన ముద్రణే. తొలి నాళ్లలో పూర్తి నిడివిగా ప్రదర్శితమైన ఈ నాటకాన్ని తిరిగి 2011లో విశాఖపట్నంలో ప్రదర్శించారు. అది చూసిన నగరానికి చెందిన కొందరు ప్రముఖులు విజయవాడలో కూడా ఏర్పాటు చేయాలని భావించి ఈ ప్రదర్శన ఏర్పాటు చేసి విజయవంతమయ్యారు. ఇలా ఎనిమిది గంటల పాటు ఈ నాటకాన్ని ప్రదర్శించడం గురజాడకు అర్పించే నిజమైన నివాళి అని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
No comments:
Post a Comment