తెలుగు చిత్రసీమలో చిరస్థాయిగా నిలిచిపోయే
అపురూపాలు ఆరెండూ. బహుముఖ ప్రజ్ఞాశాలి డా.భానుమతి క్రమశిక్షణతో,
ప్రణాళికాబద్దంగా జీవితాన్ని మలుచుకొంటే, మహానటి సావిత్రి
జీవితమంతా ఒడిదొడుకులతో ఇతరులకు పాఠంలా సాగింది. భానుమతి, సావిత్రి
వర్ధంతి సందర్భంగా యువకళావాహిని సంస్థ త్యాగరాయ గానసభలో స్వరనీరాజనం
కార్యక్రమం నిర్వహించింది. ఈ సభలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత
సి.నారాయణరెడ్డి పాల్గొని ప్రసంగించారు. అభినయ శక్తికి గానశక్తిని
సమ్మిళితం చేసిన ఘనత భానుమతిదేనని, అపూర్వమైన ఆమె స్వరం.. ఎవరూ
అనుకరించలేని మధుర స్వరం అని ఆయన కొనియాడారు. మహానటి సావిత్రి, భానుమతి
ఇద్దరూ సినీ రంగంలో ధృవతారల్లా వెలుగొందిన విదుషీమణులన్నారు.
భానుమతి రచయిత్రిగా నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, గాయనిగా తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిలో నిలిచిపోయారన్నారు. మహానటి సావిత్రి అమాయకత్వానికి మారుపేరని, ఏ పాత్రకైనా తన అభినయంతో, హావభావాలతో న్యాయం చేసేవారన్నారు. వెండితెరపై వెలుగొందిన ఆమె చివరి రోజుల్లో దుర్భర జీవితం గడిపారని, దాన గుణం ఎక్కువగా ఉన్న సావిత్రి జీవితం ఎందరికో ఆదర్శప్రాయం, గణపాఠం లాంటిదన్నారు.
ఈ సందర్భంగా అనంతరం ‘మహా నటి సావిత్రి’ పుస్తక రచయిత్రి పల్లవిని ఘనంగా సత్కరించారు.